శివ.. ధ్యానం.. కీర్తనం.. స్మరణం

మార్కండేయుడు మృకండ మహర్షి, మరుద్వతి దంపతుల కుమారుడు. ఈశ్వర అనుగ్రహంతో కలిగిన కొడుకును అల్లారుముద్దుగా పెంచుకుంటారు వాళ్లు. అయితే బాలకుడు 16 ఏళ్లు మాత్రమే జీవించి ఉంటాడని చెబుతాడు పరమేశ్వరుడు. అతనికి పదహారేళ్లు వచ్చాక తల్లిదండ్రులు తీవ్రంగా దుఃఖిస్తారు. వారి చింతకు కారణం తెలుసుకున్న మార్కండేయుడు పరమేశ్వరుడి కోసం కఠోర తపస్సు చేస్తాడు. మార్కండేయుడి ప్రాణాలు హరించడానికి వచ్చిన యముడు సైతం ఆతడి తపోదీక్షకు నివ్వెరపోతాడు. బాలకుడిపై పాశం వేయగా.. పరమేశ్వరుడు కాలరూపుడుగా ప్రత్యక్షమవుతాడు. మార్కండేయుడికి చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తాడు

ప్రతి మాసం కృష్ణ పక్షంలో చతుర్దశి పరివ్యాప్తమై ఉన్న రోజును శివరాత్రిగా భావిస్తారు. మాఘమాస కృష్ణ చతుర్దశినిమహాశివరాత్రిగా జరుపుకుంటారు. రోజునే మహాలింగం ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. మాఘ మాసాన్ని సంవత్సర సారం అంటారు. అందుకే మాఘ మాసంలో వచ్చే మాస శివరాత్రిని మహాశివరాత్రిగా నిర్ణయించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. మహాశివరాత్రి వ్రతం ఆచరిస్తే.. సంవత్సరంలోని అన్ని మాస శివరాత్రులూ వ్రతం ఆచరించిన ఫలితం దక్కుతుందని విశ్వసిస్తారు.

శివరాత్రి వ్రతం గురించి శివ పురాణం, స్కంద పురాణాల్లో విస్తృతంగా ప్రస్తావించారు. శివరాత్రి వ్రతం అంటే ముఖ్యంగా ఉపవాసం ఆచరించాలి. జాగరణ చేయాలి. వ్రతం చేయాలనుకునే వారు మహాశివరాత్రి నాడు నిద్ర లేవడంతోనే.. ఉపవాస దీక్ష చేపడుతున్నట్టుగా సంకల్పించుకోవాలి. ప్రాతఃకాలంలోనే చన్నీటితో తలస్నానం చేయాలి. వీలైతే నదీ స్నానం లేదా తటాక స్నానం ఆచరించాలి. లేనిపక్షంలో ఇంట్లో చేయాలి. స్నానం చేసే సమయంలో ‘‘శ్రీ శివాయ నమస్తుభ్యం మహాదేవాయతే నమః’’ అనే మంత్రాన్ని పఠించాలి. అనంతరం నిత్యపూజలు చేసుకుని, పరమేశ్వరుడికి ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించాలి. ప్రాతఃకాలం, మధ్యాహ్నం, ప్రదోష సమయం (సాయం సంధ్యా సమయం), లింగోద్భవ కాలం (అర్ధరాత్రి) మహాలింగానికి అభిషేకం నిర్వహించాలి.

ఉపవాసం అంటే ఆహారం తీసుకోకపోవడం. అయితే శారీరక స్థితులను అనుసరించి ఉపవాసం పట్టాలి. వృద్ధులు, గర్భిణులు, పిల్లలు, రోగగ్రస్థులు ఉపవాస దీక్ష చేపట్టాల్సిన అవసరం లేదు. శారీరక పటుత్వం ఉన్నవారు కఠిన ఉపవాసం చేయవచ్చు. అయితే అవసరానుగుణంగా పాలు సేవిస్తూ ఉపవాసం ఉండవచ్చునని శాస్త్రం చెబుతోంది. ఉపవాస దీక్షలోని భౌతికమైన అర్థం అన్నపానీయాలకు దూరంగా ఉండటం. ప్రదోష సమయంలో లింగార్చన తర్వాత ఉపవాస దీక్ష పరిసమాప్తం అవుతుంది. తర్వాత కూడా పళ్లు, పానీయాలు మాత్రమే స్వీకరిస్తారు తప్ప అన్నం జోలికి వెళ్లరు.

ఆధ్యాత్మికంగా చూస్తేఉపఅంటే దగ్గరగా.. ‘వాసంఅంటే ఉండటం అని అర్థం. దైవానికి దగ్గరగా ఉండటమే నిజమైన ఉపవాసం. మనసుతో, బుద్ధితో, ఇంద్రియాలతో మనం వేటి గురించి ఆలోచిస్తామో.. అదంతా ఆహారమే. వీటిని వదిలిపెట్టి పరమాత్ముని గురించి ఆలోచించడమే నిజమైన ఉపవాసం. అప్పుడే దీక్ష పరిపూర్ణం అవుతుంది. ఆధ్యాత్మికంగా అంతర్ముఖత్వ సాధనకు ఉపవాసం ఒక మార్గం.శివరాత్రి నాడు ఉపవాసానికి ఎంత ప్రాధాన్యం ఉందో.. జాగరణకు అంత విశిష్టత ఉంది. రాత్రి అనే శబ్దానికి యోగ భాషలో స్పృహ లేకుండా ఉండటం అని అర్థం ఉన్నది. భౌతిక విషయాలపై స్పృహ లేకుండా.. చిత్తం శివుడికి అర్పించి జాగృతంగా ఉండటమే జాగరణ. ధ్యానానికి శివరాత్రి అనుకూలమైన సమయం. అందుకే సిద్ధులు శివరాత్రి పర్వదినాన గంటల తరబడి తపోదీక్షలో ఉండిపోతారు.


ధ్యానం వల్ల అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. ఇది సాధ్యం కానప్పుడు సంకీర్తనం చేయవచ్చు. శివుడి లీలలు భజనగా, కీర్తనగా ఆలపిస్తూ జాగరణ కొనసాగించాలి. సంకీర్తనం వల్ల వాక్కు పరిశుద్ధమవుతుంది. ఇదీ సాధ్యం కాకపోతే స్మరణ చాలు. జంగమదేవుడి కథలు వినడం, కైలాసనాథుడి చరిత్రను నలుగురితో పంచుకోవడం, మహేశ్వర వైభవాన్ని చాటే పురాణాలు చదవడం వంటివి చేయాలి. సూర్యోదయం అయ్యే వరకు భగవంతుని సన్నిధిలో జాగారం చేయడం వల్ల శివరాత్రి వ్రతం పూర్తవుతుంది. అనంతరం స్నానాధికాలు పూర్తి చేసుకుని, నిత్య పూజ చేయాలి. తర్వాత స్వామివారికి అన్నం నైవేద్యంగా సమర్పించి భోజనాలు చేసుకోవాలి. శారీరక, మానసిక పరిశుభ్రతను పాటిస్తూ.. శివరాత్రి వ్రతాన్ని ఆచరించేవారికి పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది.


శ్రీకాళహస్తిలో శ్రీ అనగా సాలీడు, కాళము అనగా సర్పం, హస్తి అంటే ఏనుగు. మూడు అక్కడి వాయులింగేశ్వరుడ్ని నిష్టగా కొలుస్తుంటాయి. సాలీడు స్వామికి గూడు కట్టి తన భక్తిని చాటుకుంటుంది. ఏనుగు నిత్యం జలాలను తన తొండంతో తీసుకువచ్చి స్వామిని అభిషేకిస్తుంటుంది. సర్పం మణులతో స్వామిని పూజిస్తుంటుంది. అయితే వీటి మధ్య పరస్పర వైరం కలుగుతుంది. తన భక్తి గొప్పదంటే తన భక్తే గొప్పదని కలహించుకుని ప్రాణాలు విడుస్తాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)