హరిహర రూపం-కార్తిక మాసం

దీపావళి మరునాటి నుంచి మన సమాజంలో ఒక కొత్త పరిమళం వ్యాపిస్తుంది. ఎంతో ఉత్సాహం కలిగించే దీనికి మరో పేరు ‘కార్తిక భక్తి’. చైత్రం నుంచి మొదలయ్యే పన్నెండు మాసాల్లో కార్తికానికి ప్రత్యేకత, విశిష్టత ఉన్నాయి. ఈ మాసం హరిహర స్వరూపం. శివ, విష్ణు భక్తులకు ఇష్టమైంది. ఇద్దరికీ సమాన ప్రాధాన్యమిచ్చే మాసమిది.
కార్తికం చైతన్యం కలిగిస్తుంది. క్రమశిక్షణ నేర్పుతుంది. భక్తజనం ఈ మాసం మొదలైన రోజు నుంచి వణికించే చలిని సైతం లెక్కజేయకుండా తెల్లవారుజామునే తలారా స్నానంచేస్తారు. దీపారాధన తరవాత తులసికోట ముందు దీపాలు పెట్టి, దేవాలయానికి వెళ్లి అక్కడా వెలిగిస్తారు. అజ్ఞానాంధకారాన్ని తొలగించి, విజ్ఞాన జ్యోతులను వెలిగించి, భక్తిభావన పెంచే దీపాలవి.
అభిషేకాలు, పూజలు, దీపారాధనలతో శివ, విష్ణు ఆలయాలు ప్రకాశిస్తుంటాయి. ఉపవాసాలు, అర్చనలతో భక్తుల మనసులు నిర్మలత సంతరించుకుంటాయి. కార్తికం ఆరోగ్య మాసం. ఈ నెలలో నది, సముద్ర స్నానాలు ఉత్తమం అంటారు. వర్షకాలంలో పడిన వాననీరు భూమిలోకి ఇంకుతుంది. నదుల్లో బలమైన అయస్కాంత శక్తి ఏర్పడుతుంది. అందుకే ఈ మాసంలో సూర్యోదయానికి ముందు నది లేదా సముద్ర స్నానం చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఇది శాస్త్రం చెప్పేదైనా, భగవంతుడి పేరిట జనంలో విశ్వాసం కలిగించడానికి చెప్పేదైనా- ఆరోగ్యకర సమాజం కోసమే!
ఉసిరి చెట్టుకు, కార్తిక మాసానికి అవినాభావ సంబంధముంది. ఆ చెట్టుకింద వన భోజనాలు చేయడం కార్తికంలో సంప్రదాయం. ఉసిరి విష్ణు స్వరూపం. దాన్ని పూజిస్తే విష్ణువును పూజించినట్లే అని విశ్వసిస్తారు.
ఆలయాల్లో కార్తిక ఏకాదశి, పౌర్ణమి తిథుల్లో చేసే సత్యనారాయణస్వామి వ్రతాలు భక్తిని పెంచుతాయి. ఉపవాసం అంటే, దేవుడికి సమీపంలో వసించడం అని అర్థం. దైవధ్యానంలో ఉంటూ ఉపవసించడం వల్ల, మనసులో మంచి భావాలు వెల్లివిరుస్తాయి.
కార్తిక పురాణాన్ని నెలరోజులూ ఒక కథ వంతున చదివితే, భగవంతుడు ఎంత భక్తసులభుడో అర్థమవుతుంది. ముక్కంటికి మూడు రేకుల బిల్వ దళాలంటే ప్రీతి. ఈ మాసంలో ఆ పత్రాలతో శివుణ్ని పూజిస్తుంటారు.
ఇదే మాసంలో భగవద్గీత చదవడం- విష్ణువు అనుగ్రహం పొందడానికి సులభ మార్గంగా భక్తులు విశ్వసిస్తారు. రోజూ ఒక్క శ్లోకం చదివినా, ఆ గీతాసందేశం మానవ ప్రవర్తనలో ఎంతో మార్పు తెస్తుందంటారు. ఆషాఢ శుద్ధ దశమినాడు పాలసముద్రంలో శేషశయ్యపై శయనించిన విష్ణువు, తిరిగి కార్తిక శుద్ధ దశమినాడు మేల్కొంటాడని ఒక నమ్మకం. అందువల్ల అనంతరం వచ్చే శుద్ధ ద్వాదశికి ఒక ప్రత్యేకత ఉంది. ద్వాదశి వ్రతం విష్ణువుకు ఎంతో ఇష్టం.
కార్తిక మాసంలో చేసే కన్యాదానం, ఉపనయనం- రెండూ మంచి ఫలితాలు కలిగిస్తాయి. పుత్రికా సంతానం లేనివారు, తమ ఖర్చుతో ఇతరుల కన్యకు పెళ్లి చేసినా ఫలితముంటుందని శాస్త్రవచనం. మగ సంతానం లేనివారు పేదవారింట ఉపనయనపు ఖర్చు భరించినా సత్ఫలితం లభిస్తుందంటారు.
కార్తిక మాస వ్రత దీక్ష, దినచర్య అనేవి- చక్కని ప్రణాళికలు. ఈ నెలరోజుల పద్ధతే తరవాతి కాలానికి ఆలంబన, ఆధారం కావాలి.
అయ్యప్పస్వామి మాలధారణ, భవానీ దీక్ష, మండల దీక్షలు- కాల పరిమితికి సంబంధించినవిగా చూడకూడదు. వాటి స్ఫూర్తిని అటు తరవాతా కొనసాగించడం వల్ల శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత మెరుగుపడతాయి. అలాంటి దివ్య ఔషధమే కార్తిక మాస వ్రత ఆచరణ అంటారు విజ్ఞులు!
- చెంగల్వ బొడ్డపాటి రామలక్ష్మి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)